హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లతో తమ నాయకులపై లేనిపోని ఆరోపణలు, అసత్య ప్రచారాలు, బూతులు పోస్టులు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి హైదరాబద్ లోని బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్ల సృష్టికర్త రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా అబద్దాలు మాట్లాడుతున్నారని, ఫేక్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు. ఇపుడు కూడా ఫేక్ మాటలు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. సంధ్యారావు అకౌంట్ మహిళ పేరని, ఫోటో కూడా మహిళదేనని , కానీ ట్విట్టర్ స్పేస్ లో మాట్లాడుతున్నదని, పోస్టులు పెడుతున్నది ఓ పురుషుడని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. ఆ పురుష మహానుభావుడు ఎవరో కాదు సీఎం రేవంత్ రెడ్డి అని బాంబు పేల్చారు .
ఆ పురుషుడు ఎవరు? ఆ వాయిస్ ఎవరిది ..? రేవంత్ రెడ్డిదా? ఆయన అనుచరులదా? అనే దానిపై పోలీసులు విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వెంటనే కేసు నమోదు చేసి నిందుతులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా సంధ్యారావు అకౌంట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎవరైనా నిజంగా అవమానంగా భావించి, దాడులకు పాల్పడితే ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. అల్లర్లు, కొట్లాటలు సృష్టించే భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
బిఎన్ఎస్ సెక్షన్ 356 సెక్షన్ 353 ప్రకారం, ఐటి చట్టంలోని సెక్షన్ 66సి,66డి ప్రకారం కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లక్షల ట్విట్టర్ అకౌంట్లు ఉన్నా, సంధ్యారావు అకౌంటే ఎలా దొరికిందని ప్రశ్నించారు. వేల పోస్టులు ఉన్నా, ఈ పోస్టునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా చదివారని నిప్పులు చెరిగారు.