తిరుమల : దేశం, రాష్ట్రం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు . శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మన ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు , అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ధ్వజ స్తంభానికి నమస్కరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్ర పటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారి వైభవాన్ని దర్శించారు.
