అమరావతి : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తుంటే చూసి ఓర్వలేక, వారి అవకాశాలపై కూడా విషం చిమ్మే స్థాయికి వైసీపీ, దాని కరపత్రం ‘సాక్షి’ దిగజారాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను రోడ్లపై తిప్పిన వారు, కూటమి ప్రభుత్వం 160 పోస్టుల భర్తీకి ముందుకొస్తే ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగం ఇవ్వరు… ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు… నియామకాలు చేపడితే అనుమానాలు సృష్టిస్తారు ఇదే వైసీపీ, సాక్షి మార్కు నిరుద్యోగ వ్యతిరేక రాజకీయం అని మంత్రి వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రస్తుతం సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలోనే 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు మేం ఉద్యోగాలు ఇస్తుంటే ‘మరో రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు’ అంటూ విషపు రాతలు రాస్తున్నారు. మీ బాధ ఉద్యోగాలు రావడం గురించా? లేక ఆ ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయన్నదా? నిరుద్యోగులకు వైసీపీ, సాక్షి సమాధానం చెప్పాలి అని మంత్రి ప్రశ్నించారు.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వెటర్నరీ డాక్టర్ల నియామకాలను పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ద్వారానే నిర్వహిస్తున్న విషయాన్ని ‘సాక్షి’ ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టిందని మంత్రి ఆరోపించారు. 28.10.2016న జారీ చేసిన G.O.Ms.No.52 ప్రకారం మొత్తం 100 మార్కులతో మెరిట్ నిర్ణయించే స్పష్టమైన విధానం ఉందన్నారు. BVSc మార్కులకు 60 మార్కులు, MVSc అర్హతకు 10 మార్కులు, ప్రభుత్వ/కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు లేదా స్థానిక సంస్థల్లో కాంట్రాక్ట్ సేవకు 10 మార్కులు, గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి సీనియారిటీకి సంవత్సరానికి నాలుగు మార్కుల చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం అమల్లో ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల నియామకాలు కూడా ఇదే తరహా వెయిటేజీ విధానంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
