ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానంగా ఏపీని తీర్చిదిద్దుతాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : ఏపీని దేశంలోనే ప్ర‌ముఖ ప‌ర్యాట‌క గ‌మ్య స్థానంగా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్ర వరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొనండం ఆనందంగా ఉంద‌న్నారు. “పర్యాటకాంధ్రప్రదేశ్”గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తరలి వస్తున్నాయని అన్నారు. గత రెండున్నరేళ్లలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం కావడం, కొత్త పర్యాటక పాలసీ 2024–29తో పాటు ల్యాండ్ అలాట్‌మెంట్, ఎంప్లాయిమెంట్ జనరేషన్, కారవాన్ టూరిజం, హోమ్‌స్టే, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ వంటి విధానాలను అమలు చేయడం పర్యాటక రంగంలో కొత్త అవకాశాలకు బాటలు వేస్తోందని చెప్పారు కందుల దుర్గేష్. సుదీర్ఘ సముద్రతీరం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, అరకు, బోర్రా గుహలు, మారేడుమిల్లి, లంబసింగి, గండికోట వంటి ప్రకృతి అందాలు, విశిష్టమైన ఆహార సంస్కృతి, అరకు కాఫీ, యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం వంటి అనేక ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టే సామర్థ్యం కలిగి వున్నాయని అన్నారు.

ఆధునిక సాంకేతికతను పర్యాటక రంగంతో అనుసంధానిస్తూ ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, క్యూఆర్ కోడ్ టెక్నాలజీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం అన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహకారాన్ని తీసుకుంటున్నాం అని తెలిపారు. గోదావరి పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామ‌న్నారు. మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రకృతి వైభవంతో పాటు ఆంధ్ర వంటకాల ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. రాష్ట్రానికి 8 పర్యాటక ప్రాజెక్టుల కోసం రూ.428 కోట్ల కేంద్ర నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాన‌ని అన్నారు.పర్యాటక రంగం ద్వారా ఉపాధి, పెట్టుబడులు, స్థానిక ఆర్థికాభివృద్ధి పెంపొందించడమే కాకుండా, పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అటవీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఎండోమెంట్స్ తదితర శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!