నిర్దేశిత ప్రమాణాలు పాటించని యూనిట్లపై చర్యలు తప్పవు
సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జల వనరులను పరిరక్షించే విధంగా నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జల వనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండడం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతోపాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారినపడి, అది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడుతున్న కాలుష్య ప్రభావం, నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, 12 ఆక్వా ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పని చేస్తున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ యూనిట్లలో పర్యావరణ ప్రమాణాల అమలును నిర్ధారించేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు, నమూనాల సేకరణ, పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీపీసీబీ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించగా, కొన్నింటిలో పీహెచ్ లెవల్స్, నీటిపై తేలియాడే ఘన వ్యర్థాలు, బీఓడీ వంటి కీలక ప్రమాణాల్లో మార్పులు గుర్తించామన్నారు. పర్యావరణ ప్రమాణాలు పాటించని 10 యూనిట్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, వివరణ ఇచ్చేందుకు, దిద్దుబాటు చర్యలకు రెండు వారాల గడువు ఇచ్చినట్టు తెలిపారు. నిరంతరాయంగా ఉల్లంఘనలకు పాల్పడే యూనిట్లపై పర్యావరణ చట్టాల మేరకు నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్టు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని మూలంలోనే గుర్తించి నివారించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు నదులు, కాలువలు, చెరువులు, సాగర సంగమ ప్రాంతాలు, భూగర్భ జలాలతో పాటు ఇతర జల వనరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. వ్యర్థ జలాల్లో బీఓడీ స్థాయిలు అధికంగా ఉంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గి జలచర జీవ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టీఎస్ఎస్ (TSS) స్థాయిలు పెరగడం వల్ల నీటి నాణ్యత క్షీణించి, జలచర జీవుల ఆవాసాలు ప్రభావితం అవుతాయన్నారు.
