స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటాలి
మూడో విడత పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్
అమరావతి : 2029 ఎన్నికల లోపు మంగళగిరిలో ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజి పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానని , ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్ధాల కల. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అన్నారు. వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేం తీసుకుంటామని పేర్కొన్నారు. మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజి, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తాం అన్నారు.
తాను మంగళగిరిలో పుట్టక పోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేశానని చెప్పారు. ఇక్కడ ప్రజలను అర్థం చేసుకునే లోపే ఎన్నికలు అయిపోయాయి, 5300 ఓట్ల తేడాతో నేను ఆనాడు ఓడిపోయా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఐదు సంవత్సరాలు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడ నుంచే శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఓట్లతో నేను 2019లో ఓడిపోయానో, దాని పక్కన ఒక్క సున్నా పెట్టి ఆ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరానని పేర్కొన్నారు. మీరు నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంత బలం వస్తుందని అన్నారు. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా. మీ ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. నేను 53వేల మెజారిటీ అడిగితే, 92 వేల ఓట్ల ఆధిక్యతతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. మీరిచ్చిన మెజారిటీతో నా బాధ్యత పెరిగింది. ఆనాటి నుంచి అహర్నిశలు మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నానని అన్నారు.
