హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా భవన్లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బాలామాయదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, పద్మ, ఇందిరా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT పద్ధతి ద్వారా) జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటి వరకు 1,30,000 మంది విద్యార్థులకు ₹450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద ఇప్పటి వరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం ₹60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
