అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని చెప్పారు. ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ పనులు ప్రారంభించాయని తెలిపారు. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌కి చిరునామాగా ఏపీ తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం. రెండేళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేస్తాం అని వెల్లడించారు. ఇప్పటికే ఓ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటయ్యిందని తెలిపారు. త్వరలో 133 క్యూబిట్ సామర్ధ్యంతో క్వాంటం కంప్యూటర్ సిద్ధం అవుతుందని చెప్పారు. ఇరాన్-అమెరికా యుద్ధంతో మన దేశంలో అనేక సమస్యలు వచ్చాయి. పెట్రోలు, గ్యాస్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
విదేశాలపై ఆధార పడకుండా గ్రీన్ ఎనర్జీని ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ చేపట్టాం అన్నారు సీఎం. ప్రతీ పొలంలో, ప్రతీ ఇంటి పైనా సోలార్ రూఫ్ టాప్ లాంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత పాలకులు ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారన్నారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాం అన్నారు. గత ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచితే మన ప్రజా ప్రభుత్వంలో చార్జీలు పెంచలేదన్నారు. భవిష్యత్‌లో పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
