ప్రధాని సూచనలు పాటిద్దాం పొదుపు తోనే ఆర్ధిక స్థిరత్వం
యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి
అమరావతి : పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు సీఎం. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటి. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పని చేసే పరిస్థితి వస్తుందన్నారు. దీనిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయన్నారు. దేశం మొత్తం దుబారాను తగ్గించాలని అన్నారు. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారిందన్నారు. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీని కూడా కుదించాలని హితవు పలికారు. విదేశీ పర్యటనలు తగ్గించు కోవాలన్న ప్రధాని సూచనలను పాటిద్దాం అన్నారు. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారన్నారు. దీనిపైనా ప్రజలు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే స్వదేశంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్నారు. సెలవు వస్తే విదేశాలకు వెళ్తున్నారు. అంతకంటే మంచి ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయని వాటిని ఎంచు కోవాలని సూచించారు సీఎం. మన రాష్ట్రంలో అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు ఉన్నాయన్నారు. గోవాను మించిన టూరిజం కేంద్రంగా సూర్యలంక మారుతుందన్నారు. నాదేశం-నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలని పిలుపునిచ్చారు.