పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా ఉన్నత విద్య

భ‌రోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌లో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో టాప్ లో వ‌చ్చిన విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 580కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 31 మంది విద్యార్థుల‌ను గుర్తించారు. విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు డిప్యూటీ సీఎం చేసిన సూచ‌న‌ల మేర‌కు వారిని చేర్చుకునేందుకు ముందుకు వ‌చ్చాయి ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లు.

ఇదిలా ఉండ‌గా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్నారు. ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పించాల‌ని నిర్ణ‌యించారు.

పవన్ కళ్యాణ్ నుంచి రూ. 5 వేల సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు. ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యా సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!