తిరుపతి : కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామి వారు వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
మే 23న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం జరగనుంది .ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. 24న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 25 న సింహ, ముత్యపుపందిరి వాహనాలపై దర్శనం ఇస్తారు. ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి.
26న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 27న ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించనుండగా, రాత్రి జరిగే గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 28న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహన సేవలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తనున్నాయి. 29వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. 300న ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుండగా, రాత్రి అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. 31న ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి . ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
