న్యూఢిల్లీ : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని విన్నవించారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే తాను స్వయంగా 5 మార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వివరించారు కేంద్ర మంత్రికి.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించు కోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్ఫష్టం చేశారు సీఎం. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు వివరించారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు లేఖలో వెల్లడించారు. కాలువల సామర్ధ్యం పెంచిన మేరకు నిధులను రీఎంబర్సు చేయాలని జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
