పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దినకర్
20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ ప్రకటన
అమరావతి : ఏపీ సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తోందన్నారు ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్. శనివారం శాసన సభలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వికసిత్ భారత్‌లో భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల జల వనరుల ప్రాజెక్టులు , పారిశ్రామిక, హార్టికల్చర్ రంగాల్లో అభివృద్ధి సాధించే దిక్సూచి ఈ బడ్జెట్ అని పేర్కొన్నారు లంకా దినకర్. గరిష్ట ఆస్తుల కల్పన ద్వారా గ్రామీణ అభివృద్ధి కోసం విబిజీ–రామ్ జీ కింద రాష్ట్ర వాటా కేటాయింపులు జరిగాయని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, సాంకేతిక రంగాల అభివృద్ధి, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ స్వర్ణాంధ్రను వికసిత్ భారత్‌లో భాగస్వామ్యం చేస్తుందన్నారు.
జగన్ పాలన విధ్వంసం సృష్టించిన ఆనవాళ్లను చెరిపివేస్తూ స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో రెండవ పూర్తి స్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారన్నారు. కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రం 40% వాటా , కేంద్ర ప్రభుత్వం 60% వాటా కలుపుకొని మొత్తం రూ. 8,365 వేల కోట్లతో గ్రామీణ ఆస్తుల కల్పనకు అవకాశం కలుగుతుందని చెప్పారు లంకా దినకర్. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా ప్రతిబింబించాయని అన్నారు. ఈ బడ్జెట్ 10 జిల్లాల విశాఖ ఆర్ధిక మండలి కోసం 28 వేల కోట్లు, ఏలూరు నుండి ప్రకాశం , మార్కాపురం జిల్లా వరకు ఆర్ధిక మండలి ప్రతిపాదన వ్యయం 25 వేల కోట్ల రూపాయలు వరకు ఉండే అవకాశం ఉందన్నారు. రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ గా 30 వేల కోట్లు తో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, మార్కాపురం జిల్లాలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ఇరిగేషన్ల విషయంలో కూడా పోలవరం, వంశధార, వెలిగొండ, హంద్రీ- నీవా లను పూర్తి చేయడానికి ప్రాధాన్యతను తెలపడం చూస్తే ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ మూడు ప్రాంతాల పైన సమ దృష్టి పెట్టడం జరిగిందన్నారు లంకా దినకర్. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం స్వయం వనరులతో పూర్తి అవుతుందని స్పష్టం చేయడం ద్వారా నిధుల లేవన్న ప్రచారం తప్పుడు అని తేలిందన్నారు. ఈ బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు చైర్మన్.
