నేటి విద్యార్థులు రేప‌టి ప్ర‌జా ప్ర‌తినిధులు : స్పీక‌ర్

ప్రజాస్వామ్య దేవాలయంపై అవగాహన కల్పిస్తున్నాం

​అమరావతి : నేటి విద్యార్థులే రేప‌టి నాయ‌కులు కావాల‌ని అన్నారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. ఏపీ
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. సభా కార్యక్రమాల సందర్భంగా స్పీకర్ ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. సభకు విచ్చేసిన ఎంపీలు సీఎం రమేష్, లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటు నేతలు తంగిరాల ప్రసాద్, బీటెక్ రవి, మల్లికార్జున్ రెడ్డిలకు ఆయన సభ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం సలహా మేరకు పాఠశాల విద్యార్థులకు సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించే వినూత్న అవకాశాన్ని కల్పించామని స్పీకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ​ఇప్పటి వరకు దాదాపు 150 పాఠశాలల నుండి దరఖాస్తులు అందాయన్నారు చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. ​గత నాలుగు రోజుల్లోనే 22 పాఠశాలలకు చెందిన 798 మంది విద్యార్థులు సభను సందర్శించారు అని తెలిపారు.

​మిగిలిన 128 పాఠశాలల విద్యార్థులకు కూడా సభ ముగిసేలోపు వీక్షణ అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ​సభను సందర్శించిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందుతున్నారని అన్నారు. భవిష్యత్తులో తాము కూడా ప్రజా ప్రతినిధులుగా మారి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతుండటం సంతోషంగా ఉంద‌న్నారు స్పీక‌ర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లపై రాబోయే మంగళ, బుధవారాల్లో (ఫిబ్రవరి 17, 18 తేదీల్లో) సుదీర్ఘ చర్చ జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. 15, 16 తేదీల్లో సభకు విరామం ఉంటుందని వెల్లడించారు. ఈ రెండు రోజుల విరామ సమయాన్ని సభ్యులందరూ బడ్జెట్ ప్రతిపాదనలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి, అధ్యయనం చేయడానికి సద్వినియోగం చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!