రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు

అమరావతి : దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఖరీఫ్ పంటల MSP పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 60 వేల కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పెట్టుబడి ఖర్చుకు కనీసం 50 శాతం లాభం జోడించి MSP ధరలు నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా కల్పించే చర్యగా అభివర్ణించారు.

రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతోనే పలు పంటల MSPలను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. వరి కామన్ రకానికి క్వింటాల్‌కు రూ.72 పెంచి రూ.2441, గ్రేడ్-ఏ వరికి రూ.2461 నిర్ణయించడం రైతులకు లాభదాయకమని తెలిపారు. జొన్నకు రూ.4073, రాగికి రూ.5205, స‌జ్జ‌లకు రూ.2900, ఉలవలకు రూ.8200, మొక్క‌జొన్న‌కు రూ.2410, నువ్వులకు రూ.10,346, సన్‌ఫ్లవర్‌కు రూ.8343, పత్తికి రూ.8667, వేరుశ‌న‌గ‌కు రూ.7517 వరకు MSP పెంపు ప్రకటించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వ్యయభారం, ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు.

Leave A Reply

Your Email Id will not be published!