అమరావతి : పని చేయడమే కాదు పని చేయించడంలో నాయకత్వ పటిమ కలిగిన అరుదైన నాయకుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. డిన్నర్ విత్ రియల్ విన్నర్స్ సమావేశంలో సీఎం పనితీరును వివరించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారుల వెంటపడి టాస్క్ పూర్తి చేయించే విధానాన్ని వివరించారు. పరిపాలనలోనూ.. రాజకీయాల్లోనూ ఎలాంటి ఇగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాలు అని వ్యాఖ్యానించారు . పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో, పారిశ్రామిక వేత్తలను కలిసే విషయంలో ఇగోలను పక్కన పెట్టి టీమ్ స్పూర్తితో పని చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో 1995-1999 పాలన గురించి చెబుతారని, ఇకపై 2024-29 పాలన గురించి చెప్పుకునేలా పని చేస్తామని ప్రకటించారు నారా లోకేష్.
మంత్రులు, అధికారులు ఒక టీంగా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. లక్ష్యాన్ని చేరుకున్న ప్రతీసారి మంత్రులకు ముఖ్యమంత్రి కొత్త లక్ష్యాన్ని నిర్ధేశిస్తారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను, సంస్కరణలకు తీసుకు వచ్చిన అరుదైన నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ఏపీకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు నారా లోకేష్. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమల ఏర్పాటుకు కీలకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. అనుమతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నారా లోకేష్. దీని వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
