ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

”ఓం నమో వెంకటేశాయ” అష్టాక్ష‌రీ మంత్రం అద్భుతం

తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలోఅత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.

ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామని, సజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారు. మరణం, చీకటి వంటి భయాలను భగవన్నామ స్మరణతో అధిగమించ వచ్చని, ”ఓం నమో వెంకటేశాయ” అనే అష్టాక్షరీ మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారు. తిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వ జన్మ పుణ్యఫలమని, భగవన్నామ స్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా తిరుమల పుణ్య క్షేత్రంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) అధికారులు, వెంగమాంబ వంశీకులు పుష్పాంజలి ఘటించారు. మాతృశ్రీ శ్రీ త‌రిగొండ వెంగమాంబ జ‌యంతి సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. వెంగ‌మాంబ స్వామి వారికి అప‌ర భ‌క్తురాలిగా పేరు పొందింది.

Leave A Reply

Your Email Id will not be published!