క‌ర్ణాట‌క ప్ర‌తిపాదిత ప్రాజెక్టుపై సీఎం సీరియ‌స్

వెంట‌నే ఉప‌సంహ‌రించు కోవాల‌ని డిమాండ్

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సీరియ‌స్ అయ్యారు. క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు ప్రాజెక్టును జోసెఫ్ విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను తక్షణమే తిరస్కరించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కావేరీ నదిపై కొత్త జలాశయం నిర్మించడం సుప్రీంకోర్టు తీర్పును, కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేర‌కు జోసెఫ్ విజ‌య్ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు నిర్ణీత సమయంలో అందే నీటి ప్రవాహం తీవ్రంగా ప్రభావితం కావచ్చని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కావేరీ నదిపై ఆధారపడిన లక్షలాది మంది రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుంద‌ని, ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు జోసెఫ్ విజ‌య్. కావేరీ పరీవాహక ప్రాంత రాష్ట్రాల సమ్మతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వవద్దని ఆయన కేంద్రాన్ని, కేంద్ర జల సంఘాన్ని కోరారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను క‌లుసుకోనున్నారు. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన ప్ర‌తిపాదిత ప్రాజెక్టు గురించి కూడా చ‌ర్చించ‌నున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!