హైదరాబాద్ : వచ్చే 2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పుష్కరాలల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులతో శాసనసభ సమావేశ హాలులో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. అందుకోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చే 15 లేదా 20 రోజుల్లో నివేదికను సమర్పించాలని చెప్పారు.
ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలని స్పష్టం చేశారు. ఉప సంఘం ఆమోదించిన తర్వాత గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు సీఎం. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఈ సందర్భంగా అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
