హైదరాబాద్ : ఒకరి బలిదానం చివరకు తల వంచేలా చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ను. నిన్నటి దాకా సమ్మె నోటీసు ఇచ్చినా , 32 డిమాండ్లను పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదు . అటు సీఎం కానీ ఇటు మంత్రులు కానీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. మరో వైపు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి పోలీస్ శాఖ నుంచి వచ్చిన వారు కావడంతో ఏకంగా సమ్మె చట్ట విరుద్దమని, మానుకోక పోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఆఖరుకు వికారాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి టెంట్లు యజమానులు షామియానాలు ఇవ్వవద్దంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఏకంగా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో గత్యంతరం లేక సర్కార్ దిగివచ్చింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశం అయ్యింది.
గతంలో సీఎం కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించారు. ఈ మేరకు శాసన సభలో తీర్మానం కూడా చేశారు. కానీ పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తమ మేనిఫెస్టో లో స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చకుండా లోపాయికారిగా ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదిపింది. దీంతో సంస్థను గంపగుత్తగా అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు గుర్తించారు. తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. చివరకు సర్కార్ ఒప్పుకోవడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నేతలు.
