భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు
డీప్ టెక్ స్కిల్లింగ్‌తో అందుబాటులోకి ప్రపంచ స్థాయి టెక్నాలజీ
అమరావతి : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ భారత శాస్త్రీయ విజయాలను స్మరించుకునే రోజు. పోఖ్రాన్ విజయాన్ని గుర్తు చేసుకునే రోజు. పోఖ్రాన్ విజయంతో మన దేశ సామర్థ్యాన్ని, శక్తిని, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాం అన్నారు. నాలెడ్జ్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి అంశాలతో స్థిరమైన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని పోఖ్రాన్ విజయం నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుందన్నారు. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తోందని చెప్పారు సీఎం. భవిష్యత్ సాంకేతిక రంగాల్లో బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తూ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా IBM SkillsBuild, APSCHE, APSSDC, అమరావతి క్వాంటమ్ వ్యాలీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయి డీప్-టెక్ స్కిల్లింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించడం ఎంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాలను కవర్ చేస్తూ 2026–27 నాటికి 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నాం అని వెల్లడించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమం రూపొందించాం అన్నారు. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలు, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల ద్వారా ఈ ప్రొగ్రామ్ అమలు చేస్తున్నాం అన్నారు.
