తిరుపతి : నారాయణ వనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అనంత తేజోమూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో ముత్యపుపందిరి వాహనంపై దివ్యంగా దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం, ముత్యాల కాంతుల మధ్య ప్రకాశిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
ముత్యపుపందిరి వాహనం శాంతి, శీతలత్వం, పవిత్రతకు ప్రతీకగా భావించ బడుతుంది. ముత్యాల చల్లని నీడలో విహరించిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలను పొందారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
