హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రయాణీకులకు సంబంధించి పలు సూచనలు అందించింది. ఇదిలా ఉండగా వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసిందని సంస్థ ప్రకటించింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే ) పాటు ఇచ్చిన రాయితీ గడువు ముగియడంతో, జూన్ 1 నుండి మెట్రో డీలక్స్ , ఏసీ బస్సుల్లో పాత చార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ మార్పుపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక ముఖ్యమైన స్పష్ట ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా అందించిన సమ్మర్ డిస్కౌంట్ గడువు మాత్రమే ముగిసిందని పేర్కొంది.
కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సంస్థకు సహకరించాలని టీఎస్ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి కోరారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సుఖవంతమైన, ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మర్ ఆఫర్ను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో డీలక్స్ , ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మార్చి 2026 నుండి మే 31, 2026 వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. మూడు నెలల పాటు కొనసాగిన సాగిన ఈ ఆఫర్ గడువు ముగియడంతో జూన్ మొదటి తేదీ నుండి రాయితీకి ముందు ఉన్న పాత టికెట్ ధరలే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మూడు నెలల పాటు ఆఫర్ను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించిన ప్రయాణికులకు సంస్థ యాజమాన్యం ధన్యవాదాలు తెలియ చేసింది.
