అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి ఉత్సవ మూర్తుల సమక్షంలో ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణభట్టర్ శ్రీ ఉదయ్ స్వామి గురుకుల్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఎం.రవిచంద్ర, జేఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేక అధికారి డి. ఫణికుమార్ నాయుడు, ఆలయ సూపరింటెండెంట్ కె.పి.చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!