కూట‌మి పాల‌న‌లో వ్య‌వ‌సాయానికి పున‌ర్ వైభ‌వం

రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామ‌న్న అచ్చెన్న‌

అమ‌రావ‌తి : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుకు భరోసా కల్పించి, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకు రావడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమ‌వారం గుంటూరులో లాంఫాం నందు గ‌ల ఎన్జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ విద్యాల‌యంలో ఏరువాక పౌర్ణమి కార్య‌క్ర‌మాన్నిపొలంలో ఎద్దుల అర‌క దున్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయానికి తొలి పండుగ అయిన ఏరువాకను గుంటూరులో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పారు. రైతాంగానికి గుంటూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 66 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండేళ్లలో గాడిలో పెట్టగలిగాం.

రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అనుసంధానం వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని చెప్పారు మంత్రి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతు ఆదాయం పెంచడమే ఏన్డీయే కూట‌మి ప్రభుత్వ సంకల్పం అని అచ్చెన్నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.7,500 ఇవ్వడం మినహా రైతుకు ఉపయోగపడే అనేక పథకాలను నిలిపి వేశారని, విత్తన కంపెనీలకు వందల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి విత్తన సరఫరా వ్యవస్థను దెబ్బతీశారని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను దశలవారీగా చెల్లించి, రాయితీపై రైతులకు నాణ్యమైన విత్తనాలను స‌బ్సీడీపై అందిస్తున్నామని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!