చెన్నై : తమిళనాడు సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నూతన స్పీకర్ గా ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ గా రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ప్రసంగించారు సీఎం. వారిని ప్రత్యేకంగా అభినందించారు. తాను పేరుకు సీఎం అయినప్పటికీ సభను నిర్వహించాల్సిన బాధ్యత, తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇవ్వాల్సిందంతా స్పీకర్ పైనే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాని అందరూ సమానమేనని ప్రకటించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడినా తాను ఇబ్బంది పడినట్లే భావిస్తానని చెప్పారు. దీంతో సభ అంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది.
ఇదే సమయంలో ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యే ల గురించి కూడా సీఎం విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ముఖ్యమేనని అన్నారు. కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే ఉన్న పార్టీకి చెందిన వారైనా సరే, వారి అభిప్రాయాన్ని కూడా టీవీకే పార్టీ, తాను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు విజయ్. మా అందరి అభిప్రాయంతో సమానంగా పరిగణిస్తామని అన్నారు. మంచి సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. చెడు సూచనలను తిరస్కరిస్తామన్నారు సీఎం. ఇది ప్రజల కోసం , ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుందని చెప్పారు. తమ తమ నియోజకవర్గాలకు మంచి చేయాలన్నదే అందరి , తమ సంకల్పమని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సభలో సభాపతి మాట్లాడేందుకు, చర్చించేందుకు సహకరిస్తారని చెప్పారు. మీ విలువైన సమయాన్ని, అభిప్రాయాలను నిరభ్యంతరంగా తెలియ చేయాలని సీఎం కోరారు.
