త‌మిళ‌నాడులో 717 మ‌ద్యం రిటైల్ అవుట్లెట్లు క్లోజ్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ద్యం దుకాణాల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్కూళ్లు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు అర కిలోమీట‌ర్ దూరంలో ఉన్న మ‌ద్యం షాపుల‌ను వెంట‌నే మూసి వేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తించిన 717 ప్ర‌భుత్వ మ‌ద్యం రిటైల్ అవుట్ లెట్ల‌పై ఈ ప్ర‌భావం ప‌డింది. కాగా దుకాణాలు మూసి వేసేందుకు 2 వారాల గ‌డువు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. ఈ మూసివేత ఉత్తర్వు వివిధ రాజకీయ పార్టీలు సైతం స్వాగ‌తించారు. తాజాగా సీఎం విజ‌య్ శాస‌న స‌భ సాక్షిగా చేసిన ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు , బస్ స్టాప్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న వాటిని వెంట‌నే మూసి వేయాల‌ని అన్నారు.

తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడే ఈ దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాల్సి ఉంటుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ అధినేత, అగ్రశ్రేణి నటుడు అయిన విజయ్ జారీ చేసిన మొట్ట మొదటి ఉత్తర్వు ఇదే కావ‌డం విశేషం. సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం రాష్ట్రంలో టాస్మాక్ 4,765 మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది, వాటిలో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యా సంస్థల సమీపంలో, , 255 బస్ స్టాండ్‌ల సమీపంలో ఉన్నాయి అని ప్రభుత్వం తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!