సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు ఓకే

నేషనల్ టెక్నాలజీ డే సంద‌ర్భంగా నిర్ణ‌యం

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింత‌ల్ లో కొలువు తీరిన స‌మ‌తామూర్తి కేంద్రం నిర్వాహ‌కులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే 11న జాతీయ సాంకేతిక దినోత్స‌వం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త చెప్పింది. ఈ మేర‌కు ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు వెల్ల‌డించారు.

1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. సైన్స్ , టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక) రంగంలో మానవాళి సాధించిన అద్భుతమైన ప్రగతిని వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా భద్రత , ఆధ్యాత్మిక వాతావరణం దృష్ట్యా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి ఉండదనే విషయం తెలిసిందే. కానీ సాంకేతికతను గౌరవిస్తూ, దాని ప్రాముఖ్యతను తెలియజేసే క్రమంలో మే 11వ తేదీన సోమవారం సందర్శకులు తమ సెల్ ఫోన్లను ప్రాంగణంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. పర్యాటకులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమతా మూర్తిని దర్శించు కోవాలని కోరారు. ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుండి స‌మ‌తా మూర్తిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!