అమరావతి : ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రధాని దేశ పరువును గంగలో కలిపాడని ఆరోపించారు. జాతీయ ఉపాధి హమీ పథక పరిరక్షణ యాత్ర రాయలసీమలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా కార్నర్ మీటింగ్ లో షర్మిలా రెడ్డి ప్రసంగించారు. ప్రధాని మోదీ తీరు నామ్ నరేందర్..కామ్ సరెండర్ గా మారి పోయిందన్నారు. అమెరికా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారాడని సంచలన కామెంట్స్ చేశారు. జరిగింది గ్రేట్ డీల్ కాదు.. ఇండియాకు బ్లాక్ డీల్ అని ధ్వజమెత్తారు. దేశ రైతాంగానికి, పరిశ్రమల రంగానికి బ్లాక్ డేగా పేర్కొన్నారు.. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్ కి తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణం అన్నారు. ఈ డీల్ దేశ భవిష్యత్ కే పొంచి ఉన్న ప్రమాదం అని హెచ్చరించారు షర్మిలా రెడ్డి.
సున్నా సుంకాలతో భారత మార్కెట్ ను అమెరికా ఉత్పత్తులు శాసించాయంటే స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణ శాసనమేనని హెచ్చరించారు. మోడీ గ చేసిన బ్లాక్ డీల్ మన రూపాయి భవితవ్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇండియా ఎగుమతులపై అమెరికా సుంకాలు 18 శాతం తగ్గిస్తే, ఆ దేశ దిగుమతులపై మోడీ సుంకాలు సున్నా చేయడం ఏంటి అని ప్రశ్నించారు. మన దేశ ఉత్పత్తులపై మొన్నటి దాకా అమెరికా వేసిన పన్నులు కేవలం 5 శాతం లోపేనని అన్నారు. 5 నుంచి 50 శాతం పన్నులు పెంచి, అందులో 18 శాతానికి కుదిస్తే ఇండియాకు ప్రయోజనం ఎలా అవుతుంది అని నిలదీశారు. మన దేశానికి భారీ లాభం ఎలా చేకూరింది అని మండిపడ్డారు. సుంకాలు తగ్గింపుతో భారత్ కి దక్కే ప్రయోజనం కంటే.. సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం 100 శాతం లాభం చేకూరుతుందన్నారు.
