PDA Alliance Comment : కలిసిన ‘కత్తులు’ కలవని పొత్తులు
ప్రత్యామ్నాయం ఎంత బలం
PDA Alliance Comment : దేశంలో బలమైన భారతీయ జనతా పార్టీని, దానిని నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీకొనేందుకు ప్రతిపక్షాలు ఒక వేదికపైకి వచ్చాయి. ఇంకా కొన్ని పార్టీలు దూరంగా ఉన్నాయి. వాటిలో బీఎస్పీ, బీఆర్ఎస్ , ఎంఐఎం , తదితర పార్టీలు ఉన్నాయి. 17 పార్టీలు ఉమ్మడి వేదికను పంచుకున్నాయి. దీనికి ఎక్కువగా ప్రయత్నం చేసింది జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఎన్ని అభిప్రాయాలు భేదాలు ఉన్నప్పటికీ ముందు మనమంతా ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఇది శుభ పరిణామం. బీజేపీయేతర ప్రతిపక్ష కూటమికి పేరు కూడా పెట్టారు. దేశభక్తి ప్రజాస్వామ్య కూటమి అని నామకరణం చేశారు. దీనిని అందరూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం పీడీఏతో(PDA Alliance) ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో విధి విధానాలను ఖరారు చేస్తామని ప్రకటించారు ఉమ్మడి వేదికకు సారథ్యం వహించిన నితీశ్ కుమార్.
ఆయన గతంలో బీజేపీ(BJP)తో కొన్నేళ్ల పాటు సహవాసం చేశారు. ఆ తర్వాత విడి పోయారు. కాంగ్రెస్ , ఆర్జేడీతో కలిసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు. దేశమంతటా కులం, మతం, విద్వేషం ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ పని చేస్తోందని దీనిని ఎదుర్కోక పోతే ప్రజాస్వామ్యం మనజాలదని, దాని స్థానంలో ఏక వ్యక్తి పాలనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. న్యాయ వ్యవస్థ ఒక్కటే ఇప్పుడు కేంద్రానికి అడ్డంకిగా ఉంది. దానిని కూడా కంట్రోల్ చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది కాషాయ పార్టీ. చివరకు తమకు వ్యతిరేక తీర్పులు చెప్పినందుకు ప్రస్తుత సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ ను సైతం ట్రోలింగ్ కు గురి చేశారు.
ప్రస్తుతం దేశం సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ప్రతిపక్షాలను , బీజేపీయేతర సంస్థలు, ప్రభుత్వాలు, వ్యక్తులను, వ్యవస్థలను , కంపెనీలను టార్గెట్ చేస్తూ వస్తోంది కేంద్రం. ప్రత్యేకించి కేంద్ర దర్యాప్తు సంస్థలను తన ఆధీనంలో పెట్టుకుని ఆటాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇదే సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న నేతలు సైతం ఉమ్మడి వేదికపైకి రావడం విశేషం. కానీ ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. వీళ్లంతా ఒకే అభిప్రాయానికి రావాల్సి ఉంది. అందరూ నేతలే, ప్రతి ఒక్కరికీ ప్రధాని కావాలన్న కోరికతో ఉన్న వారే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం ముందుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు నితీశ్ కుమార్. ఏది ఏమైనా మొత్తంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ(BJP)ని ఎదుర్కోవడమనే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగాలని నిర్ణయించడం .. ఆ మేరకు అడుగులు వేయడం శుభ పరిణామమే అయినా ఏ మేరకు సక్సెస్ అవుతారనే దానిపై కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : P Chidambaram : యుసీసీపై మోదీ కామెంట్స్ తగదు
