Sena Tho Senani: “సేనతో సేనాని” పేరుతో విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

"సేనతో సేనాని" పేరుతో విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Sena Tho Senani : జనసేన పార్టీ మూడు రోజులపాటు విశాఖపట్నం వేదికగా విస్తృత స్థాయి సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు, సమావేశాలకు ‘సేనతో సేనాని’ పేరును నిర్ణయించినట్లు జనసేన పార్టీ (Janasena) పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాల ద్వారా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)… పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగే విస్తృతస్థాయి సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాలకు సంబంధించి పార్టీ శాసన సభ్యులు, నాయకులు, జీవీఎంసీ అధికారులు, పోలీసులతో ఆదివారం శ్రీ మనోహర్ గారు ప్రత్యేకంగా భేటీలు అయ్యారు. 30వ తేదీన నిర్వహించబోయే సభ వేదిక అయిన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను పరిశీలించారు. అనంతరం సభకు సంబంధించిన సేనతో సేనాని పోస్టర్ ను ఆవిష్కరించారు.

Sena Tho Senani Meeting

ఈ సమావేశంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూటమి చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ… “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనాపరమైన విషయాల్లో పూర్తిగా దృష్టి నిలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు పార్టీ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాలకు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులు, నాయకులతో మమేకమవుతారు. పార్టీ కార్యక్రమాల అమలు, కూటమి స్ఫూర్తిని నిలబెట్టడం, భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేలా, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లో నింపేలా, యువతరాన్ని రాజకీయాల్లో ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాలు రూపొందించాం. మూడు రోజులపాటు జరిగే విస్తృతస్థాయి సమావేశాలను ప్రతిరోజు వినూత్నంగా తీర్చిదిద్దేలా, పార్టీ కార్యకర్తలు, వీర మహిళల అభిప్రాయాలు తెలుసుకునేలా కార్యక్రమం ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Sena Tho Senani – మూడు రోజులుపాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలు

28వ తేదీ: ఉదయం 9 గంటలకు, విశాఖపట్నం బీచ్ రోడ్ లోని వైఎంసీఏ హాలులో జనసేన పార్టీ (Janasena) తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో భవిష్యత్ లో జనసేన పార్టీ పాలనపరంగా కూటమి స్ఫూర్తి ని ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరు, పాలనలో బలమైన ముద్ర, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సి లకు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశం చేస్తారు. చట్టసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తారు.

అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతారు. రాష్ట్ర కార్యవర్గంలో సుమారు 350 మందితో పవన్ కళ్యాణ్ పార్టీని మరింతగా జనంలోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న అంశాలను, పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవలసిన బాధ్యతలపై రాష్ట్ర కమిటీలకు ప్రత్యేక ప్రణాళిక అందిస్తారు. జనసేన పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలను, వీర మహిళలకు పార్టీకి మరింత చేరువ చేయాల్సిన అంశాలు, పార్టీలోని అంతర్గత అంశాలపై చర్చిస్తారు.

29వ తేదీ : ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారితో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. పార్టీకి మొదటి నుంచి పని చేసిన వారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు, పార్టీ కోసం బలమైన పోరాటాలు చేసిన వారు, ప్రజలతో మమేకమై పార్టీని విస్తృతంగా బలపరిచిన వారు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లినవారు, అలాగే యువత, విద్యావంతులు, మేధావులను ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో అన్ని విషయాలు పట్ల చర్చిస్తారు. ఉద్యోగులు వ్యాపారులు, యువత, విద్యార్థులు, వృత్తి నిపుణులతో పాటు అన్ని రంగాల నుంచి ఈ భేటీలో యువతకు ప్రాధాన్యమిస్తూ వారి ఆలోచనలను, సృజనను తెలుసుకునేందుకుపవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

భవిష్యత్తు రాజకీయాల్లో యువత బాధ్యతపై ప్రత్యేకంగా మాట్లాడించి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాష్ట్రానికి మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, ఉపాధి మార్గాలు, పర్యాటక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకునే తీరు, సోషల్ మీడియాను వినియోగించుకుని సమాచారాన్ని అందిపుచ్చుకుని అంశాలు, తదితర విషయాలపై ఈ భేటీలో వచ్చిన అతిథులతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా మాట్లాడుతారు. వర్తమాన రాజకీయాల్లో యువత ప్రభావం పైన ఇష్టాగోష్టి నిర్వహిస్తారు.

30వ తేదీ: మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పార్టీ రాష్ట్రస్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మొదలవుతుంది. ఉత్తరాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్ర వేదికగా జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమం పార్టీకి ఎంతో కీలకం.

పార్టీ మీద పూర్తిస్థాయిలో దృష్టి సారించి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ శ్రేణులు నూతనత్తేజం పుంజుకుంటారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ తరఫున 12 కమిటీలను ఏర్పాటు చేశాం. కమిటీ లోని వారికీ ప్రత్యేక బాధ్యత లు అప్పగించాం. అధికారులను, పోలీసులను సమన్వయం చేసుకుంటూ పార్టీ వాలంటీర్లు కూడా భద్రత ఏర్పాట్లు, సౌకర్యాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు” అని చెప్పారు.

Also Read : Sajjala Ramakrishna Reddy: అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి – పార్టీ కార్యదర్శులతో సజ్జల

Leave A Reply

Your Email Id will not be published!