చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు ప్రజల సంక్షేమాన్ని తన విధానంగా స్వీకరించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎఎల్) తరపున వాసుదేవనల్లూరు నియోజకవర్గం నుండి గెలిచిన మా అభ్యర్థి అనంత్ అయ్యస్వామికి మద్దతుగా జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. తమిళనాడులో కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలనతో కూడుకుని ఉన్న ఏకైక పార్టీ డిఎంకె అని ఆరోపించారు అన్నామలై. గత 5 సంవత్సరాల డిఎంకె పాలనలో, తమిళనాడు ఒక చీకటి కాలాన్ని చవిచూసిందని మండిపడ్డార.
తన స్వార్థ ప్రయోజనాల కోసం తమిళనాడును దోచుకుని, రాష్ట్ర అభివృద్ధిని స్తంభింప జేసిన అసమర్థ డిఎంకె పాలనను కూకటివేళ్లతో పెకిలించి వేయడానికి తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. డిఎంకె పాలన అసమర్థత కారణంగా, తమిళనాడు మాదక ద్రవ్యాలకు నిలయంగా, మహిళలకు అసురక్షిత రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కె. అన్నామలై. తన ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా, సామాన్య ప్రజలను మోసం చేస్తూ, అవినీతిలో కూరుకు పోయిన ఈ కమీషన్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, డీఎంకే తన 84వ ఎన్నికల వాగ్దానంలో సేన్భాగవల్లి డ్యామ్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. గత 5 సంవత్సరాలలో ఈ డ్యామ్ ను పట్టించు కోలేదని ఆరోపించారు కె. అన్నామలై. వీరకేరళంబుదూర్ ప్రాంతంలోని జంట చెరువుల ప్రాజెక్టును కూడా అమలు చేయలేదన్నారు. ఫలితంగా, 48 కుగ్రామాలు, 15 గ్రామ పంచాయతీలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని వాపోయారు. ఈ విధంగా డీఎంకే ప్రభుత్వం రైతుల జీవనోపాధిని నాశనం చేసిందన్నారు. రాబోయే ఎన్నికలు రైతుల కన్నీళ్లకు సమాధానం ఇస్తాయన్నారు.
