పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ ఎం . రమేష్ కుమార్ తో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పీ పీ ఏ ఉప సంచాలకులు ప్రవీణ్ వర్మ, రాష్ట్ర జల వనరుల శాఖ ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, ఎస్ ఈ ఆర్. రామచంద్ర రావు, నాణ్యతా విభాగం చీఫ్ ఇంజనీర్ శేషు బాబు, ఎస్ ఈ తిరుమల రావు, ఈ ఈ లు బాల కృష్ణ, శ్రీనివాస్, నరసింహారావు, ప్రేమ్ చంద్ , నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి , తదితరులు పాల్గొన్నారు.
గత నెల చివరి వారంలో నాలుగు రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరంలో పర్యటించింది. ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించింది. పలు సూచనలు, సలహాలు చేసింది. ఆ తరువాత ఢిల్లీలో పీ పీ ఏ సి ఈ ఓ పైతాన్కర్ తో సమావేశమైంది. ఆ సమావేశం తరువాత పోలవరం పర్యటనకు వచ్చిన పైతాన్కర్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై తొలుత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం ఆయన క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2027 సంవత్సరం డిసెంబర్ నాటికి పోలవరం ను పూర్తి చేస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
