అమరావతి: ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి లోకేష్ సమీక్షించారు. కాకినాడ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో స్టూడెంట్, టీచర్ యావరేజ్ అటెండెన్స్ తక్కువగా ఉందన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పదో తరగతి పరీక్షా ఫలితాలు, మధ్యాహ్న భోజనం వినియోగంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. అపార్ ఐడీ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచారని మంత్రి ప్రశంసించారు. కాకినాడ డీఈవో పి.రమేష్ స్పందిస్తూ.. జిల్లాలో 3,665 మంది డ్రాపౌట్స్ ఉన్నారు. ఎన్ రోల్ కానివారు 14,840 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు అసలు ఎన్ రోల్ కానివారిపై దృష్టి సారించామని చెప్పారు.
పలు మండలాల్లో సూడెంట్స్ అటెండెన్స్ తక్కువగా ఉండటంపై తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకు వస్తున్నట్లు వివరించారు. పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది 80.47శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన వారు 2789 మంది ఉన్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో విద్యార్థుల డ్రాపౌట్స్ పై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వలస వెళ్లే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలకు సెలవుల అనంతరం విద్యార్థులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారి చదువు కొనసాగేలా ట్రాక్ చేయాలని ఆదేశించారు. సీజనల్ హాస్టల్స్ ను వినియోగించు కోవాలని సూచించారు. జిల్లాలో స్టూడెంట్, టీచర్ అటెండెన్స్ తక్కువగా ఉందని, లీప్ యాప్ లో టీచర్ అటెండెన్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. స్టూడెంట్, టీచర్ రేషియోపైనా దృష్టి సారించాలన్నారు.