బెంగుళూరు : శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతి సామరస్యాలను చాటి చెప్పే ప్రపంచ మానవుడు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేవలం ఓ ముఖ్యమంత్రిగానే ఇక్కడికి రాలేదు. ఓ భారతీయుడిగా, గురూజీ బోధనల్ని అనుసరిస్తున్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఆధునిక ప్రపంచానికి వారధిగా శ్రీ రవిశంకర్ గురూజీ వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. హింసలేని సమాజం-ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని సాధించాలని దశాబ్దాలుగా బోధిస్తూ మానవాళికి గొప్పసేవ చేస్తున్నట్లు తెలిపారు. యుద్ధాలతో శాంతికి దూరమైన సమాజాన్ని, అనిశ్చితి నుంచి బయట పడేసేలా మానవత్వం అనే అత్యుత్తమ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారని అన్నారు సీఎం .
యుద్ధ క్షేత్రాల నుంచి ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్, డైలాగ్, ఇన్నర్ స్ట్రెంత్ అనే విధానాలను అనుసరించారని ప్రశంసించారు. గ్రామాల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకూ, అనిశ్చితి నెలకొన్న కొలంబియా ప్రాంతాల వరకు చర్చలు అనే శాంతి మార్గం ద్వారా మార్పులు తెచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. సామాన్య ప్రజలతో పాటు అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకున్న ఆధ్యాత్మిక వేత్త శ్రీ రవిశంకర్ గురూజీ అని పేర్కొన్నారు. 45 ఏళ్లక్రితం హ్యాపీ హ్యూమన్ బీయింగ్, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ బెటర్ వరల్డ్ అనే విజన్ తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిందన్నారు. సురక్షిత తాగునీరు, రివర్ రిజునవేషన్, మహిళా స్వయం సమృద్ది, విలువలతో కూడిన విద్య లాంటి రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు.
