కోల్ కతా : అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఐపీఎల్ 19 సీజన్ ఆరంభంలో తీవ్ర నిరాశ పరిచిన ఆ జట్టు ఉన్నట్టుండి పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. దీంతో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు మరింత క్లిష్టంగా మారింది. ఇప్పటికే మూడు జట్లు ఖరారు కాగా మరో ప్లేస్ కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో రాజస్తాన్, కోల్ కతా, పంజాబ్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. ఒకానొక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ముంబై. ఆ సమయంలో బ్రాష్ 32 రన్స్ చేస్తే, పాండ్యా 26 పరుగులతో ఆదుకున్నారు. చివరలో తిలక్ వర్మ ప్రయత్నం చేసినా ఆశించిన మేర పరుగులు రాలేదు. కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముంబైని కట్టడి చేశారు. అనంతరం మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్లలోనే 148 పరుగులు సాధించి 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది . పాంబే 45 రన్స్ చేస్తే రోవెన్ పావెల్ 40 పరుగులు చేశారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఈ విజయంతో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో కొనసాగుతోంది.