తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరిక

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. ఆదివారం త‌న‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుబట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

గుంటూరులో టిడిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు సృష్టించిన గొడవను నానాజీ తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులు బయట పడుతున్నాయనే భయంతోనే అంబటి ఇలాంటి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడటం అంబటి అహంకారానికి నిదర్శనమని, దీనికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని పంతం నానాజీ స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని, అంబటి రాంబాబు లాంటి వారు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని నానాజీ పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!