తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సిట్ నిర్వాకంపై మండిపడింది. పొద్దస్తమానం చదివిన అభ్యర్థులు పరీక్షలు రాశాక రద్దయ్యాయంటే దాని వెనుక ఉన్న బాధ ఏమిటో అర్థం చేసుకోక పోతే ఎలా అని ప్రశ్నించింది.
టెక్నాలజీ పరంగా టాప్ లో ఉన్నామని సర్కార్ చెబుతోంది. దీని గురించి గొప్పలు చెప్పుకుంటోంది. మరి ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజీ చోటు చేసుకుంటే ఇప్పటి వరకు ఎవరు కీలక పాత్రధారులు, సూత్రధారులు అని తేల్చలేక పోయారా అని నిలదీసింది. నిగ్గు తేల్చాల్సిన సిట్ ఏం చేస్తోంది. ఇంత సమయం ఎందుకు పడుతోందంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ వ్యవహారం వెలుగలోకి వచ్చి నెలన్నర అయినా ఇంకా విచారణ చేపడుతున్నారా అని మండిపడింది. పేపర్ల లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సిట్ లేక సీబీఐ అన్న దానిపై ఏప్రిల్ 28న ఖరారు చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల నేతలు తమ అవసరాల కోసం ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారని వారిని విచారిస్తే అసలు విషయాలు తెలుస్తాయా అని అనుమానం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ జరిపారు. ఇంత సమయం ఎందుకు పడుతోందంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. 12 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నామని, 40 మంది సాక్షులను, 20 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. కమీషన్ లో స్కాం చోటు చేసుకుంటే మంత్రి కేటీఆర్ ఎలా వివరాలు బయటకు వెళ్లడిస్తారంటూ మండిపడింది.
