కర్ణాటకలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తం 224 సీట్లకు గాను పోలింగ్ జరిగింది. మే 13న శనివారం రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం వరకు ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై క్లారిటీ వస్తుంది. ఇప్పటి దాకా ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే అందులో 2 మాత్రం పూర్తి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పేర్కొన్నాయి.
ఒక్కటి మాత్రం బీజేపీ వైపు చూపింది. మిగతా 7 సర్వే సంస్థలు మాత్రం హంగ్ ఏర్పడటం ఖాయమని, దేవగౌడ పార్టీ జేడీఎస్ కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశాయి. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. జేడీఎస్ ను ప్రసన్నతం చేసుకునే పనిలో ఫోకస్ పెట్టాయి.
మరో వైపు భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసిందని ప్రచారం ఊపందుకుంది. తమ పార్టీకి చెందిన నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడిందని తెలియడంతో అప్రమత్తమయ్యారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఇప్పుడే తెలిసిందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ కమలం అనేది తమ దృష్టికి వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. కేపీసీసీకి చీఫ్ గా ఎంపికైన నాటి నుంచి నేటి దాకా తాను నిద్ర పోలేదన్నారు డీకే శివకుమార్, తమ పార్టీకి చెందిన వారంతా తనతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు.
