మైనింగ్ రారాజుగా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీ నుంచి ఒక్కడే గెలుపొందాడు. తన భార్యతో పాటు ఇతరులు కూడా కాంగ్రెస్ గాలికి కొట్టుకు పోయారు. కర్ణాటకలో తాజాగా వెలువరించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎవరూ ఊహించని రీతిలో కన్నడిగులు హస్తానికి కట్టబెట్టారు. ఆ పార్టీ ఏకంగా ఏకైక మెజారిటీ సాధించిన పార్టీగా నిలిచింది.
ఎన్నికలకు ముందు గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారు. ఉన్నట్టుండి ఆ పార్టీని వీడి స్వంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నుంచి తన భార్యతో పాటు పలువురిని ఎన్నికల బరిలో నిలిచేలా చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. చివరకు గాలి ఒక్కడే విజయం సాధించడం విశేషం. బళ్లారి నుంచి పోటీ చేసిన తన భార్య అరుణ లక్ష్మీ ఓటమి పాలయ్యారు.
బళ్లారి గాలి జనార్దన్ రెడ్డికి పెట్టని కోట. ఆయన మైనింగ్ మాఫియాకు డాన్ గా ఉన్నాడు. పేరు పొందాడు కూడా. మొత్తం సీట్లకు గాను కేఈఆర్పీపీ నుంచి 47 మంది బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా కొప్పాల్ జిల్లా గంగావతి నుండి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడే గెలుపొందడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందగా బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
