కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం నిప్పులు చెరిగారు. శనివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కులం, మతం, విద్వేష రాజకీయాలు ఏవీ పని చేయలేదన్నారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ అందించారని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇది పూర్తిగా తమ పార్టీకి ఒక టానిక్ లాగా పని చేస్తుందని ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి ఓ గుణపాఠం అని చెప్పక తప్పదని పేర్కొన్నారు పి. చిదంబరం.
ఇది పూర్తిగా కర్ణాటక ప్రజలు సాధించిన విజయమని అభివర్ణించారు. రాచరిక పాలన సాగదని, అవినీతి, అక్రమాలు చెల్లుబాటు కావని స్పష్టమైన తీర్పు చెప్పారని అన్నారు పి. చిదంబరం. ఈ గెలుపు ప్రజాస్వామ్యానికి చిహ్నమని, భారత రాజ్యాంగం పట్ల స్పూర్తిని మరోసారి కర్ణాటక వాసులు చాటారని వారికి ఈ సందర్భంగా తాను ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని తెలిపారు.
పొద్దస్తమానం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ , మతం పేరుతో రాజకీయాలను చేయాలని చూసే బీజేపీకి, దాని అనుబంధ సంస్థలకు ఒక రకంగా ఈ ఫలితాలు చెంప పెట్టుగా పి. చిదంబరం అభివర్ణించారు . ఇకనైనా బీజేపీ మారాలని, ప్రధానంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు.
