ఇది పూర్తిగా వ్యక్తిగత నష్టమని భావ జాలం వల్ల జరిగిందని కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకైక మెజారిటీ కలిగిన పార్టీగా నిలిచింది. ఆ పార్టీ 136 సీట్లు గెలుచుకుంటే అధికారంలో ఉన్న బీజేపీ 65 సీట్లకు పరిమితమైంది. ఇక జేడీఎస్ 19, ఇతరులు 4 సీట్లకే పరిమితం అయ్యారు.
రాజకీయంగా తాను ఓడి పోయినట్లు భావించడం లేదన్నారు. సీటీ రవి మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు కర్ణాటకలో. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిక్కమగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ డీ తమ్మయ్య చేతిలో 7,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడికి ఇది కోలుకోలేని దెబ్బ.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నా. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. అంతే కాదు గెలుపొందిన అభ్యర్థి తమ్మయ్యకు, మిగతా కాంగ్రెస్ అభ్యర్థులకు అభినదనలు తెలియ చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ఒకరు ఓడి పోవడం ఇంకొకరు గెలవడం. ఎందుకు ఓడి పోయామనేది మేం ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందన్నారు సీటీ రవి.
ఇది వ్యక్తిగత నష్టం తప్ప భావజాలానికి సంబంధించినది మాత్రం కాదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటామని స్పష్టం చేశారు సీటీరవి. తమకు అండగా నిలిచిన కన్నడిగులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
