అమరావతి : రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరలు, వర్జీనియా పొగాకు కొనుగోళ్లు, తోతాపూరి మామిడి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృత సమీక్ష నిర్వహించి రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపినా, రైతులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించ లేదని అన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.
రైతులు, కంపెనీల మధ్య సమన్వయం ద్వారా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయానికి రావాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర అంగీకారంతో పరిమిత స్థాయిలో ధరల సవరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫీడ్ ధర కేజీకి ఇప్పుడున్న ఎంఆర్పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుందని చెప్పారు. ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని, 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని, అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, మాజీ మంత్రులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు .
