అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తోతాపూరి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకూడదన్న సంకల్పంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోతాపూరి మామిడికి కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . పల్ప్ పరిశ్రమల్లో నమోదు చేసుకుని మామిడిని విక్రయించిన రైతుల ఖాతాల్లో నేరుగా ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వేలాది మంది మామిడి రైతులకు గణనీయమైన ఊరటనిస్తుందని చెప్పారు. జూన్ 20న పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000 చొప్పున రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో రైతు సంక్షేమానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం అరుదైన విషయమని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కార మార్గాలు అన్వేషిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ఆదాయం పెరగడం, గిట్టుబాటు ధరలు లభించడం, ఉత్పత్తి వ్యయాలు తగ్గించడం, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యంతో రైతులకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
