కర్ణాటకలో భారీ విజయాన్ని నమోదు చేసినా కాంగ్రెస్ కు తలనొప్పులు తప్పడం లేదు. కౌన్ బనేగా సీఎం అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు కొనసాగుతున్నాయి. 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు లభించాయి. కర్ణాటక ప్రజలు భారీ మెజారిటీని కట్టబెట్టారు. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది.
బీజేపీ 65 సీట్లకు పరిమితం కాగా జేడీఎస్ 19 సీట్లతో సరి పెట్టుకుంది. నలుగురు స్వతంత్రులు గెలుపొందినా తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ప్రకటించారు. దీంతో వీరిని కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ బలం 140కి పెరుగుతుంది.
భారీ ఎత్తున గెలుపొందినా , సీట్లు పొందినా ఇంకా సీఎం ఎవరు అనేది తేల్చ లేక పోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బెంగళూరులో సీఎల్పీ మీటింగ్ ముగిసింది. అయితే సిద్దరామయ్యనా లేక డీకే శివకుమారా అన్న దానిపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ముగ్గురిని పరిశీలకులుగా నియమించింది. చివరకు సీఎం ఎవరనే దానిని నిర్ణయించేది ఢిల్లీకి చేరింది.
ప్రస్తుతం సీఎల్పీ అభిప్రాయాన్ని ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే , సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పంచుకుంటుంది. సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు. బెంగళూరు హోటల్ బయట సిద్దరామయ్య, శివకుమార్ మద్దతుదారులు నినాదాలు చేశారు.
