Vijay Sai Reddy : విజ‌య‌సాయి రెడ్డికి సుప్రీం నోటీస్

సెప్టెంబ‌ర్ 5 లోగా స‌మాధానం ఇవ్వాలి

వైస్సార్పీసీ ఎంపీ , పార్ల‌మెంట‌రీ పార్టీ చీఫ్ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసుకు సంబంధించి వ‌చ్చే సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి స్ప‌ష్ట‌మైన స‌మాధానాలు ఇవ్వాల‌ని ఆదేశించింది. విజ‌య సాయి రెడ్డితో పాటు జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ , భార‌తి సిమెంట్స్ యాజ‌మాన్యానికి సైతం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసులో ఈ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోవ‌డం విశేషం. ప్ర‌స్తుతం జ‌గ‌న్ రెడ్డి ఆస్తుల‌కు సంబంధించిన కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది. గ‌త కొన్నేళ్లుగా ఈ కేసు కొన‌సాగుతూ వ‌స్తోంది. కాగా సీబీఐ కేసుల విచార‌ణ పూర్త‌య్యేంత వ‌ర‌కు ఎలాంటి విచార‌ణ జ‌ర‌ప వ‌ద్దంటూ ఇప్ప‌టికే తెలంగాణ హైకోర్టు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) డైరెక్ట‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ ఆదేశాల‌ను 2021లో కోర్టు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఆ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఈ దావాలో ఎంపీ విజ‌య సాయి రెడ్డితో పాటు జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ , భారతి సిమెంట్స్ ను ప్ర‌తివాదులుగా చేర్చ‌డం విశేషం. ఈ మేర‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.

Leave A Reply

Your Email Id will not be published!