TUWJ Slams : హైదరాబాద్ – మీడియా పేరుతో ఎలాంటి గుర్తింపు లేని పత్రికలు, యూట్యూబ్ ఛానెల్స్ ఐడి కార్డులు సృష్టించి, పవిత్రమైన జర్నలిజాన్ని అపవిత్రత పాలు చేస్తున్న అసాంఘిక శక్తులకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పిలుపునిచ్చింది.
TUWJ Slams Fake Media People
మంగళవారం సంస్థ కీలక ప్రకటన చేసింది. జర్నలిజం పట్ల ఎలాంటి అవగాహన లేని అసాంఘిక శక్తులు, జల్సాలకు అలవాటు పడి, అడ్డ దారుల్లో డబ్బులు సంపాదించడానికి జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించింది. సమాజంలో సృష్టిస్తున్న అలజడి సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
ఇటీవల మెదక్ జిల్లా నార్సింగ్ లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నకిలీ విలేకరుల ముఠాను పట్టుకొని వారికి తమ సంఘం సరైన గుణపాఠం చెప్పిందని తెలిపింది. అక్షరం ముక్క కూడా రాయలేని ఈ అసాంఘిక శక్తులు, జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడుతూ పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని పేర్కొంది టీడబ్ల్యూయుజే.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotta Prabhakar Reddy)పై హత్యాయత్నానికి పాల్పడ్డ, మిడిదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి రాజు అనే యువకుడి జేబులో ఏకంగా 5 మీడియా ఐడి కార్డులు దొరకడం విస్మయం కలిగిస్తోందని వాపోయింది.
అవన్నీ నకిలీ మీడియా సంస్థలు సృష్టించిన ఐడీ కార్డులేనని స్పష్టం చేసింది. జర్నలిస్టుల ముసుగులో ప్రతి గ్రామంలో ఇలాంటి అసాంఘిక శక్తులు పుట్టుకు రావడం సమాజానికి పెను ప్రమాదంగా భావిస్తున్నామని తెలిపింది.
త్వరలోనే తమ సంఘం తగు కార్యాచరణ రూపొందించి, జర్నలిజం వృత్తిలో మొలుస్తున్న ఇలాంటి కలుపు మొక్కలను ఏరివేసే చర్యలకు పూనుకోబోతోందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ స్పష్టం చేశారు.
Also Read : Kasani Jnaneshwar : బాబుకు కాసాని ప్రేమ లేఖ
