CBI: 70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకు చిక్కిన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌

70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకు చిక్కిన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌

CBI : తెలంగాణాలో సీబీఐకి వలకు పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ కమిషనర్‌… సీబీఐ(CBI) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.70 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్‌ ఆదాయపన్ను శాఖ కమిషనర్‌(మినహాయింపుల విభాగం), మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ కుమారుడు జీవన్‌ లాల్‌ లావుడ్యాతోపాటు శ్రీకాకుళానికి చెందిన సాయిరాం పాలిశెట్టి, విశాఖకు చెందిన నట్ట వీరనాగా శ్రీరాంగోపాల్, ముంబయి షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్‌ డీజీఎం(టాక్సేషన్‌) విరాల్‌ కాంతిలాల్‌ మెహతా, ముంబయి చెంబూరుకు చెందిన సాజిదా మజహర్‌ హుస్సేన్‌షా కటకటాల పాలయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

CBI Arrest Income Tax Officer

జీవన్‌లాల్‌ లావుడ్యా హైదరాబాద్‌ ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ గానే కాకుండా హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అప్పీల్స్‌ యూనిట్‌-7, 8లకు కమిషనర్‌గానూ పనిచేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు సంబంధించిన అప్పీళ్లు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వారికి అనుకూలంగా వ్యవహరించేందుకు మధ్యవర్తుల ద్వారా 70 లక్షల రూపాయల లంచం డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో సీబీఐ బృందం జీవన్‌లాల్‌ సహా 14 మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ.70 లక్షల లంచం చేతులు మారుతోందనే పక్కా సమాచారంతో ముంబయిలో నిఘా ఉంచింది. శనివారం లంచం సొమ్మును మధ్యవర్తి తీసుకుంటున్న సమయంలో వల పన్ని పట్టుకుంది. విచారణ క్రమంలో ఆ సొమ్ము కమిషనర్‌ ఆదేశాల మేరకు తీసుకుంటున్నట్లు మధ్యవర్తి అంగీకరించడంతో ముంబయిలోనే అతడిని అరెస్ట్‌ చేసి అక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

మరోవైపు కమిషనర్‌తోపాటు మరో ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసింది. జీవన్‌లాల్‌ తండ్రి, మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ నివాసం(ఖమ్మం) సహా ముంబయి, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీల్లోని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మరో రూ.69లక్షల నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీబీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Also Read : Miss World 2025: మిస్‌ వరల్డ్‌ పోటీలకు వ్యతిరేకంగా మహిళల ధర్నా

Leave A Reply

Your Email Id will not be published!