Doctor Family: లండన్‌ లో సెటిల్ అవుదామని బయలుదేరి బూడిదైన డాక్టర్ కుటుంబం

లండన్‌ లో సెటిల్ అవుదామని బయలుదేరి బూడిదైన డాక్టర్ కుటుంబం

Doctor Family : అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా(Air India) బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో మరో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌ కు చెందిన ఓ డాక్టర్ కుటుంబం మొత్తం మరణించింది. రాజస్థాన్‌ లోని బన్స్వారాకి చెందిన కోమి వ్యాస్ కు… ప్రతీక్‌ జోషి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తో వివాహం అయింది. డాక్టర్‌ కౌమీ వ్యాస్‌ ఉదయ్‌పూర్‌ లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ప్రతీక్ జోషి… గత ఆరేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్‌ ఉన్నారు. అయితే కుటుంబం మొత్తాన్నీ లండన్‌ కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్‌ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి.

Doctor Family Tragic Death

దీనితో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ పసిఫిక్ ఆసుపత్రిలో తన డాక్టర్‌ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్‌ భారత్‌ కు వచ్చి కుటుంబంతో సహా లండన్‌ కు వెళ్లి అక్కడ స్థిరపడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా (Air India) విమానానికి టిక్కెట్లు బుక్ చేసుకుని… బ్యాగులనీ ప్యాక్‌ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. లండన్‌ కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు.ఇంతలోనే విమాన ప్రమాదంలో విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్నారు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్‌లో సమాధిగా మారిపోయింది.

ఈ ఘటనపై డాక్టర్ కోమి వ్యాస్ స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఉదయపూర్‌ లోని తన ఉద్యోగాన్ని వదిలి, తన ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌కు తన భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళుతోంది. ఈరోజు కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో వారంతా ఉన్నారు. అంటూ ఆమె ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమై పోస్టులు చేస్తున్నారు. కొత్త ఆరంభాల అంచున ఉన్న కుటుంబం… కొన్నిసార్లు జీవితం చాలా అనిశ్చితంగా, క్రూరంగా ఉంటుంది. అంటూ తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Also Read : Newly Wed Woman: నవవధువు ఆశలు ఆవిరి చేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!