KCR: కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ
కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ
KCR : కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. దీనితో తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ దృష్టి సారించారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం హరీశ్‌రావు ఎర్రవెల్లి వెళ్లారు. కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్, దామోదర్ రావు తదితరులతో పార్టీ అధినేత సమావేశమయ్యారు.
KCR – కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు అందించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామని సీజే ధర్మాసనానికి తెలిపారు.
కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నివేదిక వెబ్సైట్లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం, కమిషన్‌కు 3 వారాలు, ప్రతివాదుల కౌంటర్‌పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలుంటాయని ఏజీ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను 5 వారాలకు వాయిదా వేసింది.
Also Read : TG High Court: కేక్ కట్ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది – జస్టిస్ నగేశ్ భీమపాక
